Sri Ramanavami
Festival Description
హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు . శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం, శ్రీ సీతారాముల కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజునే జరిగిందని హిందువుల ప్రగాఢ విశ్వాసం.
రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని దశరథుడికి పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.
శ్రీ రామ నవమి సంధర్భంగా అన్ని ఆలయాలలోను చలువ పందిళ్ళు వేసి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా చేస్తారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడానికి విచ్చేసిన భక్తులకు మిరియాలు వేసిన పానకము, వడ పప్పు ప్రసాదంగా ఇస్తారు అంతే కాకుండా సీతారాముల కళ్యాణం లో వాడిన తలంబ్రాలని భక్తులకు పంచుతారు. ఆ తలంబ్రాలను తమ పూజ గదిలో పెట్టుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం కోదండ రాముని వివాహానికి సామాన్య ప్రజలే కాదు దేవతలు కూడా దివి నుంచి భువికి దిగివస్తారని ఉవాచ.
ఈ పండుగ వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. అలాగే పెసరపప్ప్పుశరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తి అభివృద్ధి పరుస్తుంది, దేహకాంతి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పునే వడపప్పు అంటారు. ఇది మండుతున్న ఎండలలో 'వడదెబ్బ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది.
ఇంకా శ్రీరామనవమి రోజున వేకువజామునే నిద్రలేచి, తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. శ్రీ సీతారామలక్ష్మణ, భరత, శతృఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమల పండ్లు సిద్ధం చేసుకోవాలి పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి.
అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.
ఇక శ్రీరామ దేవాలయం, భద్రాచలం, ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ వంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతముతో అభిషేకం, శ్రీరామ ధ్యానశ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణము వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకలసంపదలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామ కథ వ్రతమును ఆచరించడం మంచిది. శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయని పురోహితులు చెబుతున్నారు.